chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 6:45 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో పిచ్చి కుక్క బీభత్సం.. 16 మందికి గాయాలు పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 23:

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. మర్రిమాను వీధి, ప్యాలెస్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేసి పలువురిని కరిచింది. ఈ ఘటనలో సుమారు 16 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా కుక్క దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిన్నారులు,మహిళలు,వృద్ధులు ఇళ్ల బయటకు రావడానికి కూడా భయపడిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. అనంతరం పిచ్చి కుక్కను పట్టుకుని బంధించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుప్పం పట్టణంలో కొంతమంది వీధి కుక్కలకు ఆహారం పెట్టి రోడ్లపై వదిలిపెట్టడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు ఆరోపించారు. ముఖ్యంగా జయప్రకాశ్ రోడ్డు, హెచ్‌పి రోడ్డులోని సిరి కళాక్షేత్రం వీధుల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు అధికంగా రాకపోకలు సాగిస్తుంటారని, వీధి కుక్కలు తరచూ దాడికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.