
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు11:
చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, విద్యార్థుల వసతి, మౌలిక సదుపాయాల కల్పనకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ తెలిపారు. మంగళవారం ఆయన కుప్పం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి మదర్ డెయిరీ పరిశ్రమ, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట మదర్ డెయిరీ పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. పరిశ్రమ అవసరాలకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వికాస్ మర్మట్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో హంద్రీ-నీవా సుజల స్రవంతి నీటిని కుప్పం ప్రాంతానికి తీసుకురావడంతో పరిశ్రమలకు కూడా నీటి అవసరాలు తీర్చే అవకాశం ఏర్పడిందన్నారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా మదర్ డెయిరీతో పాటు ఇతర పరిశ్రమలకు అవసరమైన నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని నీటి కాలువల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనివల్ల పారిశ్రామిక రంగంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. అనంతరం రాళ్లబూదుగూరు ప్రభుత్వ మహిళా వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు, ఆహారం, పరిశుభ్రత, సిబ్బంది పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. వసతి గృహానికి సానుకూల స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంపై సమీక్షించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని వార్డెన్‌కు సూచించారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి రాళ్లబూదుగూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఇటీవల చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సేవలు అందించడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం విజిలాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. వసతి, భోజనం, పరిశుభ్రత తదితర అంశాల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వార్డెన్, పాఠశాల అధికారులకు సూచించారు. భోజనశాల గోడలపై పెయింటింగ్ సరిగా లేకపోవడాన్ని గుర్తించిన ఆయన గోడలకు కొత్తగా పెయింటింగ్ వేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేశారు. వంటగదిలో వంట సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కొత్త స్టవ్‌ను కూడా మంజూరు చేశారు. విద్యార్థుల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంతో పాటు పాఠశాలకు అవసరమైన కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు పాఠశాల ప్రాంగణంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చివరగా కడపల్లె డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, వసతి గృహ నిర్వహణ, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ మాట్లాడుతూ కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విద్య, వైద్యం, వసతి, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
