chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:17 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆకస్మిక తనిఖీలు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 26:

 

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం బస్టాండ్, కంచబందార్లపల్లె, రాళ్లబుదుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కర్లగట్ట సచివాలయం, పరమసముద్రంలోని అలీప్ పరిశ్రమ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా కుప్పం బస్టాండ్‌ను మున్సిపల్ కమిషనర్‌ శ్రీనివాస రావుతో కలిసి సందర్శించిన పిడి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అభివృద్ధి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కంచబందార్లపల్లెలో కడ ప్రత్యేక తనిఖీ బృందం, సంబంధిత శాఖ అధికారులతో కలిసి భూగర్భ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన, ప్రతి రోజు చెత్త సేకరణ ఆటో వస్తుందా, తాగునీటి సమస్యలేమైనా ఉన్నాయా, గ్రామంలో ఇతర ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రజలు తెలిపిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాళ్లబుదుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ నిర్వహించిన పిడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కర్లగట్ట సచివాలయాన్ని కడ ప్రత్యేక తనిఖీ బృందంతో కలిసి పరిశీలించిన ఆయన, ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందేలా సచివాలయ పరిపాలన సమర్థవంతంగా కొనసాగాలని అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణ, ప్రజా సేవల అమలు మరియు కార్యాలయ నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. చివరిగా పరమసముద్రంలో నిర్మాణంలో ఉన్న అలీప్ పరిశ్రమల పనులను పరిశీలించిన వికాస్ మర్మట్, నిర్ణయించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి పరిశ్రమలను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కడ ప్రత్యేక దృష్టి సారిస్తోందని అధికారులు తెలిపారు.