chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 12:00 pm Digital Edition : CHITTOORE EXPRESS

కస్తూరి నగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మాదకద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ సోమశేఖర్ రెడ్డి

 

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 31:

 

 

చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆదేశాల మేరకు వి.కోట మండలంలోని కస్తూరి నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం వి.కోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్. సోమశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎస్. షైక్షావలి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళం సిబ్బంది, ప్రత్యేక బృందం సభ్యులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు కొనసాగిన ఈ తనిఖీలలో కస్తూరి నగర్ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతలను బలోపేతం చేయడం,అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. స్థానిక ప్రజలు కూడా పోలీసుల చర్యలను స్వాగతిస్తూ సహకారం అందించారు.