శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మర్చి 04:
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి) స్కూల్ ను కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్ళబుద్దూరు ఎస్.ఐ తో కలిసి సందర్శించి, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు పలు ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధైర్య స్పర్శ, క్రమశిక్షణ, బాల్య వివాహాల నివారణ, నైతిక విలువల పెంపకం, లక్ష్య సాధనపై ప్రేరణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, డ్రగ్స్ వినియోగం దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై అవగాహన, ట్రాఫిక్ నియమ నిబంధనల పాటింపు వంటి అంశాలపై విద్యార్థులకు స్పష్టమైన వివరణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం కూడా సక్రియంగా పాల్గొని, ప్రశ్నోత్తరాల తరహాలో చర్చలు నిర్వహించారు. పోలీసులు యువతరంలో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో సుస్థిరమైన, శాంతియుతమైన సమాజం నిర్మాణానికి బాలికల పాత్రపై ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. బాల్య వివాహాలు, మందుల వినియోగం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి సమస్యలు జీవితాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయో ఉదాహరణలతో వివరించారు. అలాగే “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అంశంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించి, ఏదైనా అనుచిత పరిస్థితి ఎదురైతే వెంటనే సమీపించదగిన వ్యక్తులు, పోలీసులకు సమాచారం ఇవ్వడం చేయాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులలో న్యాయం, భద్రత, నైతికత పట్ల అవగాహన పెరగడమే కాకుండా, వారి లోపల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యం కూడా సాధించారు. పాఠశాల స్థాయి నుంచే యువతరంలో చట్టాన్ని, సురక్షిత జీవన విధానాన్ని బలంగా పెంపొందించాలని సీఐ మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు.