
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,ఆగస్ట్01;
ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఓటుకు బయోమెట్రిక్ వ్యవస్థను అనుసంధానం చేయాలని హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాల కరస్పాండెంట్ హఫీజ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుప్పంలోని హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.., పాఠశాలలో క్లాస్ లీడర్ ఎన్నికలను వినూత్నంగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ ఆధారిత ఓటింగ్ యాప్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి రూపొందించి అమలు చేశామని తెలిపారు. ఈ విధానంలో ప్రతి ఓటు సంబంధిత వ్యక్తి బయోమెట్రిక్ ధృవీకరణ తర్వాతే నమోదవుతుందని, దీంతో దొంగ ఓట్లు వేసే అవకాశమే ఉండదని చెప్పారు. రేషన్ కార్డులకు బయోమెట్రిక్ అనుసంధానం చేసినట్లుగానే ఎన్నికల ఓటర్లకు కూడా బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తే ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని హఫీజ్ అభిప్రాయపడ్డారు. “మీ ఓటు – మీ బాధ్యత” అనే భావనతో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో అమలు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలో రూపొందించిన బయోమెట్రిక్ ఓటింగ్ విధానం భవిష్యత్తులో ఎన్నికల సంస్కరణలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి దేశవ్యాప్తంగా ఓటుకు బయోమెట్రిక్ లింక్ చేసే విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ ఆధారిత ఓటింగ్ యాప్ పనితీరును మీడియా ప్రతినిధులకు వివరించారు.
