chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:22 am Digital Edition : CHITTOORE EXPRESS

ఒకే ఒక్కడు వంట మాస్టర్.. విద్యార్ధులతోనే వంట పనులు..!

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగష్టు 04 :

 

రేణిగుంటమండలంలోని విమానాశ్రయం సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంఘం ఆరోపించింది. పాఠశాలలో ఒక్కవంట మాస్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, వంట మాస్టర్ అసిస్టెంట్లు,క్లీనింగ్ సిబ్బంది లేకపోవడం తో విద్యార్థులే వంటశాలలో పనులు చేస్తున్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి హరినాథ్ తెలిపారు. మంగళవారం “సామాజిక శంఖారావం సర్వే”లో భాగంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి హరినాథ్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లాఅధ్యక్షురాలు కె.ఈశ్వరమ్మ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు.పాఠశాల లో సుమారు 350 మంది విద్యార్థులు ఉండగా,స్నానాల గదులు, బాత్రూములు, మరుగుదొడ్లు కలిపి కేవలం 30 మాత్రమే ఉన్నాయని, అవి కూడా అపరిశుభ్రంగా ఉండటంతో గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఇద్దరు క్లీనింగ్ వర్కర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి రోజుకు మూడుసార్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో వంటశాలలో ఐదుగురు సిబ్బంది పనిచేసేవారని, ప్రస్తుతం ఒక్క వంట మాస్టర్ మాత్రమే ఉండటంతో విద్యార్థులే కూరగాయలు తరిగడం, నీరు, మజ్జిగ, కోడిగుడ్లు, బియ్యం బస్తాలు మోయడం వంటి పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ దృశ్యాలను తమ ఫోన్ కెమెరాల్లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పాఠశాలను సందర్శించినప్పటికీ ఈ సమస్యలు ఆయన దృష్టికి రాలేదని పేర్కొన్న సంఘం నాయకులు, ఖాళీగా ఉన్న ఒక వంట మాస్టర్, మూడు వంట మాస్టర్ అసిస్టెంట్ పోస్టులు, ఇద్దరు క్లీనింగ్ సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.