chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:45 am Digital Edition : CHITTOORE EXPRESS

ఐదు నెలల తర్వాత బాధితురాలికి దక్కిన 8 గ్రాముల బంగారు గొలుసు సీసీటీవీ ఆధారంగా గుర్తించి అప్పగించిన గాజులమండ్యం పోలీసులు

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 16:

 

మహాశివరాత్రి రోజున పోగొట్టుకున్న 8 గ్రాముల బంగారు గొలుసును సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించి బాధితురాలికి తిరిగి అప్పగించిన గాజులమండ్యం పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రేణిగుంట మండలం వికలాంగుల కాలనీకి చెందిన రమీజా ఈ ఏడాది ఫిబ్రవరి15న మహాశివరాత్రి సందర్భంగా గాజులమండ్యం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద తన 8 గ్రాముల బంగారు గొలుసును పోగొట్టుకుంది.అదే రోజు గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, గొలుసును వెతికి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు రేణిగుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ ఐ హరీషా పోలీసు సిబ్బంది మహేంద్రబాబు,మణి సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.పరిశీలనలో కింద పడిన బంగారు గొలుసును ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. తదుపరి విచారణలో ఆ వ్యక్తి తిరుపతిలోని ఎస్‌వీ నగర్‌కు చెందిన ఏసుబాబుగా గుర్తించిన పోలీసులు, గురువారం అతడిని గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విచారణలో తనకు బంగారు గొలుసు దొరికినవిషయాన్ని అతడు అంగీకరించి, గొలుసును పోలీసులకు అప్పగించాడు. అనంతరం పోలీసులు 8 గ్రాముల బంగారు గొలుసును బాధితురాలు రమీజాకు అప్పగించారు. పోగొట్టుకున్న నగను గుర్తించి బాధితురాలికి అందజేయడంలో కృషి చేసిన రేణిగుంట రూరల్ సీఐ ఎం.మంజునాథ రెడ్డి, పోలీసు సిబ్బంది మహేంద్రబాబు, మణిలను రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు అభినందించారు.