సంయుక్త పీహెచ్డీ కార్యక్రమాల నిర్వహణకు ఎంఓయూలు
శ్రీకాళహస్తి , చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 14
శ్రీకాళహస్తి భారత్ కెనడా మధ్య విద్యా, పరిశోధన, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కెనడాకు చెందిన డల్హౌసీ విశ్వవిద్యాలయం తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ సంస్థలతో సంయుక్త పీహెచ్డీ కార్యక్రమాల నిర్వహణకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనీందర్ సిద్ధూ, కాన్సుల్ జనరల్ జెఫ్ డేవిడ్, రెండు సంస్థల డైరెక్టర్లు ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ, ప్రొఫెసర్ శంతను భట్టాచార్య సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి.
తిరుపతిలో ఏర్పాటు చేయనున్న డల్హౌసీ ట్రై-ఇన్స్టిట్యూషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. స్వచ్ఛ ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఆరోగ్య సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయం, డిజిటల్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వంటి కీలక రంగాల్లో సంయుక్త పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు, ఇరు దేశాల మధ్య విద్యా, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం.ఈ ఒప్పందాలపై డల్హౌసీ విశ్వవిద్యాలయం గ్లోబల్ రిలేషన్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణన్ పృథ్వీరాజ్, ఐఐఎస్ఈఆర్ తిరుపతి అసోసియేట్ డీన్ డాక్టర్ అన్నపూర్ణ దేవి అల్లూ, ఐఐటీ తిరుపతి డీన్ డాక్టర్ శశిధర్ గుమ్మా సంతకాలు చేశారు.
