
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ జూన్11:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (ఎస్‌ఐఆర్) వెరిఫికేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధి లోని డీకే పల్లి యూనిట్ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాయకులు సూచించారు. గురువారం నిర్వహించిన ఈ సమావేశంలో సచివాలయ సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు, పార్టీ బాధ్యులతో కలిసి వెరిఫికేషన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఎల్‌ఏ (బూత్ లెవల్ ఏజెంట్), బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)లు ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల తొలగింపులు, చేర్పులు, సవరణలు వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలని తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా ద్వంద్వ నమోదులు లేకుండా పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని కోరారు. ఓటరు జాబితా ఎన్నికలప్రక్రియకు మూలాధారమని,అందువల్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు,ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి పారదర్శకంగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలన్నా రు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమమని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్, 11వ వార్డు కౌన్సిలర్ వేలు, కో-క్లస్టర్ ఇంచార్జి తిరుమగల్, యూనిట్ ఇంచార్జిలు మణి, సుభాన్ బాబు, 12వ వార్డు ఇంచార్జి రవి, పార్టీ అధ్యక్షులు ఇర్ఫాన్, సాయి, బూత్ అధ్యక్షుడు ఉమాశంకర్, ఎస్‌టీఈ సెల్ అధ్యక్షుడు నాగభూషణం, మాజీ ఉప సర్పంచ్ సోమశేఖర్, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.