
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 05 :
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేసి,నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రేణిగుంట తహసీల్దార్ శ్రవణ్ కుమార్,ఎంపీడీవో రవిచంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం రేణిగుంట పట్టణంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా తాసిల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీవో చంద్రారెడ్డి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొని సేకరణ, డిజిటలైజేషన్ పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు,సూపర్వైజరీ అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ..,ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఓటరిని బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి కలవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి,వాటిని పూర్తిగా నింపించుకుని సకాలంలో సేకరించాలని,అనంతరం వెంటనే డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాల ని చెప్పారు. అలాగే ఏఈఆర్వోలు,సూపర్వైజర్లు ప్రతి రోజు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా బీఎల్‌వోలకు పూర్తిసహకారం అందించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు.ప్రతి ఓటరు తమ ఓటరు గుర్తింపు కార్డు,ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను మరింత వేగవంతం చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఎంపీడీవో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.., ఎస్‌ఐఆర్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి బీఎల్‌వో,సూపర్వైజర్ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిం చాలని సూచించారు. ప్రజలందరూ నిర్ణీత సమయంలో అధికారులకు సహకరించి తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్, బీఎల్‌వోలు, విఆర్‌వోలు, తెలుగుదేశం పార్టీ రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి,పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.