chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 5:39 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన  చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 28:

 

 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ, కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ తెలుగుజాతికి, తెలుగుభాషకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. సినీ జీవితంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఖ్యాతి పొందిన ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ ప్రస్థానంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారని చెప్పారు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల భావితరాలకు ఆదర్శమని, యువత ఆయన నైతిక విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి, నాయకత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, ఆర్‌ఐ వెల్ఫేర్ చంద్రశేఖర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.