
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 27:
64 పెద్దూరు గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో శాంతిపురానికి చెందిన గ్రేస్ మారియా ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాన్విక డెంటల్ కేర్ సహకారంతో శనివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 70 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. దంత ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డా. ప్రవల్లిక మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే నోటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడం, భోజనం అనంతరం నోరు శుభ్రం చేసుకోవడం, అధికంగా తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించడం వంటి అలవాట్లు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయని విద్యార్థులకు సూచించారు. గ్రేస్ మారియా ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ట్రస్టీ అరోకియా రాజ్, కార్యదర్శి జేసు మారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించి విద్యార్థులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ట్రస్ట్ ప్రతినిధులు, వైద్య బృందం పాల్గొన్నారు. శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన ట్రస్ట్ ప్రతినిధులకు, వైద్యులకు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.