chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 8:40 am Digital Edition : CHITTOORE EXPRESS

ఉచిత వైద్య శిబిరాలతో విశేష సేవలు అందిస్తున్న పీఈఎస్

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:

 

చిత్తూరు జిల్లాకుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు విశేష స్పందన పొందాయి. గత పది ఏళ్లుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుబ్బలూరి నాగరాజు మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు దాదాపు పది వేల మందికి వైద్య సేవలు అందించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్సలు, సలహాలు అందించడం ద్వారా ప్రజలకు మేలు చేకూర్చినట్లు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు నిర్వహించిన శిబిరాల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. పీఈఎస్ ఆసుపత్రి సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే అరవైకి పైగా గ్రామాల్లో శిబిరాలు విజయవంతంగా నిర్వహించగా, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో పీఈఎస్ ఆసుపత్రి చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు.