chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 4:34 am Digital Edition : CHITTOORE EXPRESS

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2026–27 పోస్టర్ ఆవిష్కరణ యువత పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 27:

 

భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2026–27లో చిత్తూరు జిల్లా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2026–27 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ యువత తమ నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ ఒక గొప్ప వేదిక అని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజయం సాధించడంతో పాటు అనంతరం నిర్వహించే వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని ఐటీఐలు, పాలిటెక్నిక్, డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులతో పాటు శిక్షణ పొందిన యువత, పరిశ్రమల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2026–27లో మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెకాట్రానిక్స్, ఇండస్ట్రీ 4.0, రోబోటిక్స్, సీఎన్‌సీ మిల్లింగ్, సీఎన్‌సీ టర్నింగ్, వెల్డింగ్, ఆటోమొబైల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైన్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ప్లంబింగ్, బ్యూటీ థెరపీ, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధిక భాగం స్కిల్ విభాగాలకు 2003 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన అభ్యర్థులు, కొన్ని ప్రత్యేక విభాగాలకు 2006 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల యువత వెంటనే నమోదు చేసుకుని ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొని చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.