chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:16 am Digital Edition : CHITTOORE EXPRESS

ఆర్వోబీ పనుల జాప్యంపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు

పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 15:

 

పీలేరు పట్టణంలో కొనసాగుతున్న జాతీయ రహదారి ఆర్వోబీ నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ…పీలేరు పట్టణం గుండా మదనపల్లె–తిరుపతి, కడప–చిత్తూరు మార్గాలను అనుసంధానించే జాతీయ రహదారులైన ఎన్‌హెచ్–40, ఎన్‌హెచ్–71 పరిధిలో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణ పనులు 2022 సంవత్సరం నుంచి కొనసాగుతున్నాయని తెలిపారు. సుమారు ఐదేళ్లుగా పనులు సాగుతుండటంతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పనుల నిర్వహణలో కాంట్రాక్టు సంస్థ కనీస నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. రోడ్లపై దుమ్ము, ట్రాఫిక్ అంతరాయాలు, ప్రత్యామ్నాయ మార్గాల లేమి, హెచ్చరిక బోర్డుల కొరత వంటి కారణాలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటుండటంతో స్థానిక వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆర్వోబీ నిర్మాణ పనులను నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ వినతిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత కాంట్రాక్టు సంస్థకు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిమికండ్రిగ సుధాకర్ బాబు, తుమ్మల ధరణ్ కుమార్, జెట్టి మల్లికార్జున, కె. ఆనంద్, నగిరిమడుగు సుభాష్ తదితరులు పాల్గొన్నారు.