
పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 21:
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా కీలక సాధనమని ఆర్డీవో నారాయణరెడ్డి అన్నారు. జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పీలేరు పట్టణ పంచాయతీ కార్యాలయంలో యోగా థెరపిస్ట్ పీవీఎస్ లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించడానికి, ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి, శారీరక దృఢత్వాన్ని సాధించడానికి యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. యోగా థెరపిస్ట్ పీవీఎస్ లక్ష్మి మాట్లాడుతూ,మారుతున్న జీవనశైలిలో యోగా ఒక సహజ ఔషధంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో యోగా ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివశంకర్, డెమో అధికారి నిర్మలమ్మ, పంచాయతీ ఈవో బ్రహ్మానంద రెడ్డి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, న్యాయ సలహాదారు డాక్టర్ రాయల్ సుధాకర్, పదవీ విరమణ పొందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపీనాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.