కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 24:
కుప్పం పరిధిలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి స్కూల్ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు విద్యార్థులను ఆరు గంటల్లో గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న మాదనపల్లి గ్రామానికి చెందిన లోహిత్ కుమార్ (14), 8వ తరగతి, నితిన్ (12), 6వ తరగతి విద్యార్థులు మంగళవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల హెడ్‌మాస్టర్ గుడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్,ఎస్సై రాళ్లబుదుగురు నరేష్,పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల సమన్వయంతో చేసిన శోధనలో విద్యార్థులను సుమారు ఆరు గంటల్లో గుర్తించి సురక్షితంగా తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వేగంగా స్పందించిన పోలీసుల చర్యలను స్థానికులు అభినందించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాల నియమాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.