chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 12:38 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఆపరేషన్ “వజ్రప్రహార్” నిర్వహించిన పోలీసులు  రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,మార్చి07:

 

రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్” పేరుతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు కుప్పం సిఐ శంకరయ్య తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కుప్పంలో చేపట్టినట్టు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లు, గోదాములు, లాడ్జీలు, పబ్లిక్ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రదేశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆపరేషన్ సందర్భంగా మొత్తం 67 మంది వ్యక్తులను పరిశీలించి, అనుమానాస్పద కదలికలపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. అలాగే కొన్ని ఇళ్లు మరియు ఇతర ప్రదేశాలలో కూడా తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించడం జరిగిందన్నారు. పోలీసులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలపై పడే ప్రతికూల ప్రభావాలు మరియు చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఇటువంటి ప్రత్యేక ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. సమాజాన్ని మాదకద్రవ్యాల నుంచి రక్షించడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు.