chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 5:14 am Digital Edition : CHITTOORE EXPRESS

అసంక్రమిత వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలి నాణ్యమైన వైద్య సేవలపై దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 15:

 

ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచి అసంక్రమిత వ్యాధులను నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. జిల్లాలో జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NP-NCD) అమలుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 4వ జిల్లా టెక్నికల్ సపోర్ట్ యూనిట్ (TSU) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులకు శాశ్వత చికిత్స లేదని, ముందస్తు గుర్తింపు, నివారణ, సకాలంలో చికిత్స, నిరంతర ఫాలోఅప్ ద్వారానే వాటిని సమర్థంగా నియంత్రించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ వైద్యుల సేవలతో అనుసంధానం చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐసీఎంఆర్ స్టార్-ఎన్‌సీడీ బృందంతో సమన్వయంగా పనిచేసి కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా పి.కొత్తకోట, బంగారుపాళెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పైరోమెట్రీ సేవలను బలోపేతం చేయడంతో పాటు, బంగారుపాళెం సీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న HbA1c పరీక్షలను సమర్థంగా వినియోగించి మధుమేహ నియంత్రణను మరింత పటిష్ఠం చేయాలని తెలిపారు. ఫెసిలిటీ డెవలప్‌మెంట్ ప్లాన్ (FDP)షెడ్యూళ్లను సక్రమంగా అమలు చేయాలని,NP-NCDకార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని నాణ్యతతో, సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రయోగశాలలను CMC EQASహబ్‌లో నమోదుచేసి ప్రయోగశాల సేవలనాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.ప్రయోగశాలలపనితీరులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బయోకెమిస్ట్రీ అనలైజర్ల కాలిబ్రేషన్‌ను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు నెలలో 5వ జిల్లా టెక్నికల్ సపోర్ట్ యూనిట్ సమావేశాన్ని నిర్వహించి అప్పటివరకు చేపట్టిన చర్యల పురోగతిని సమీక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. నాగశశి భూషణ్ రెడ్డి, జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి డా. పద్మాంజలి దేవి, ఎంహెచ్‌వో డా. లోకేష్, ఐసీఎంఆర్ స్టార్-ఎన్‌సీడీ పరిశోధనా బృందం సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.