chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:19 am Digital Edition : CHITTOORE EXPRESS

అభివృద్ధి పనులపై వికాస్ మర్మట్ ఆకస్మిక తనిఖీలు  కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 02:

 

రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కుప్పం ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంస్థల పనితీరును కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా మునిస్వామిపురంలోని ప్రభుత్వ బీసీ,ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన వికాస్ మర్మత్, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించా రు. గదుల విస్తరణతో పాటు అవసరమై న మౌలిక సదుపాయాలుకల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రామచంద్ర రోడ్డులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. హాస్టల్‌ను పరిశుభ్రంగా నిర్వహిస్తున్న వార్డెన్‌ను అభినందించారు. విద్యార్థిను ల కోసం ప్రత్యేక భోజనశాల ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లలో మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుప్పం పట్టణంలోని హెచ్‌పీ రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ పనులను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించిన ఆయన, పనుల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారుల ను ఆదేశించారు. తదుపరి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన వికాస్ మర్మత్, రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులను కలిసేందుకు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా టోకెన్ విధానం అమలు చేయాలని సూచించారు. రోగులు, వారి సహాయకుల కోసం ప్రత్యేక నిరీక్షణ ప్రాంతం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం టాటా సంజీవని కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. గుడిపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న అధికారుల అతిథి గృహాన్ని కూడా పరిశీలించిన ఆయన, పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేసి త్వరగా వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా వికాస్ మర్మత్ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సంస్థల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు అందించే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.