కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 14:
కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం కుప్పం డి.ఎస్.పి పార్థసారథి ఉత్తర్వుల మేరకు కుప్పం అర్బన్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్యాలెస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఎన్. దేవేంద్రన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో టపాసులను నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు అక్కడ నిర్వహించిన తనిఖీలలో అక్రమంగా నిల్వ చేసిన టపాసులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ టపాసుల విలువ సుమారు రూ.4,22,260గా పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేయడం లేదా విక్రయించడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.