chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 11:45 am Digital Edition : CHITTOORE EXPRESS

అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం… పరిహారం కోరిన రైతు సంఘం

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే04:

 

జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాలు, ఈదురు గాలులతో మామిడి సహా ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జిల్లా రైతు నాయకుడు ఉమాపతి నాయుడు తెలిపారు. నిన్న సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో కురిసిన వర్షాలకు అనేక మండలాల్లో పంటలు నేలపాలయ్యాయని పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మామిడి మరియు ఇతర ఉద్యాన పంటలు ఒక్కసారిగా కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. ఈ సంవత్సరం తీవ్ర ఎండల ప్రభావంతో పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో, మిగిలిన పంట కూడా వర్షాల కారణంగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం మే నెలలో కురిసే అకాల వడగళ్ల వానలు, భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంటలు నష్టపోతున్నప్పటికీ ఇప్పటివరకు మామిడి రైతులకు సరైన నష్టపరిహారం అందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి మరియు ఇతర ఉద్యాన పంటల రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.