chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 10:30 pm Digital Edition : CHITTOORE EXPRESS

అంబేద్కర్ జయంతి సందర్భంగా  రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న  మెగా ఇంజనీరింగ్ సంస్థ

రామకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:

 

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ పాఠశాలను దత్తత తీసుకుని ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్లు ప్రసాదరావు పాల్గొని సంస్థ చొరవను అభినందించారు. అంబేద్కర్ జయంతి రోజునే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధి ఎం.జి.వి.కె భాను, కేఏడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం యూడీఏ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎం.జి.వి.కె భాను మాట్లాడుతూ కేవలం సిఎస్ఆర్ నిధులతో భవనాలు నిర్మించడం మాత్రమే లక్ష్యం కాదని తెలిపారు. విద్యార్థుల్లో ప్రవర్తన మార్పు తీసుకురావడం, క్రమశిక్షణతో కూడిన విద్య అందించడం ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేలా మానసికంగా సిద్ధం చేయడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అధికారులు, నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మెగా సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున ఈ కార్యక్రమం ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.